TDP : టీడీపీలోకి వెళితే భవిష్యత్ ఉంటుందా?
తెలుగుదేశం పార్టీకి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. సీనియర్ నేతల నుంచి యువనేతలతో ఆ పార్టీ ఫుల్లు అయిపోయింది
తెలుగుదేశం పార్టీకి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. సీనియర్ నేతల నుంచి యువనేతలతో ఆ పార్టీ ఫుల్లు అయిపోయింది. ఇప్పటికే కూటమి ఏర్పడటంతో మిత్ర పక్షాలకు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేయాల్సి రావడంతో అనేక మంది టీడీపీ నేతలు తమ టిక్కెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీ పోస్టు కోసం, మరికొందరు రాజ్యసభ స్థానాల కోసం వెయిట్ చేస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీకి సేవలందించిన నేతలకు చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే టీడీపీ ఓడిపోయినా నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు ఖచ్చితంగా పదవులు దక్కుతాయి.
కండిషన్ అప్లయ్...
అయితే ఇప్పుడు వైసీపీ నుంచి జంప్ అవుతున్న నేతలకు ఆ పార్టీలో ఎంత మేరకు భవిష్యత్ ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. ఇప్పటికే చంద్రబాబు కండిషన్లు పెట్టారు. టీడీపీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు తెలిపారు. అయినా పార్టీ మారి వచ్చే నేతల వ్యక్తిత్వాన్ని పరిశీలించిన తర్వాతనే తాము కండువా కప్పుతామని చెప్పారు. అంటే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి రావాలంటూ చంద్రబాబు నేరుగా సంకేతాలు ఇచ్చారు. అలా వచ్చిన వారినే టీడీపీలోకి చేర్చుకుంటామని తెలిపారు. అయితే నియోజకవర్గాల్లో వారి బలాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని కూడా టీడీపీ చీఫ్ తెలిపారు.
జంప్ అయిన నేతలకు...
2014 లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. అందులో నలుగురు మినహా మిగిలిన నేతలు ఎవరినీ ప్రజలు ఆదరించలేదు. చంద్రబాబు టిక్కెట్ కూడా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన అమర్‌నాధ్ రెడ్డి, కడప నుంచి ఆదినారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ మాత్రమే కొంత రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగారు. మిగిలిన జంప్ చేసిన నేతలు దాదాపుగా ఫేడ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు కూడా పార్టీ మారిన నేతలకు ఫ్యూచర్ గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే పదవుల్లో ప్రయారిటీ ఈ ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ నేతలకే ఉంటుంది. తప్పించి పార్టీ మారి వచ్చిన నేతలకు ఆ హామీ కూడా టీడీపీ హైకమాండ్ ఇవ్వడం లేదు.
వచ్చే ఎన్నికల నాటికి...
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, తమకు సీటు వస్తుందని ఆశించినా చివర వరకూ టిక్కెట్ దక్కుతుందన్న ఆశలేదు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి పోటీచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు జనసేన, అటు బీజేపీలోనూ టిక్కెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రానున్న కాలంలో జనసేన, బీజేపీలో చేరతారు. గత ఎన్నికల్లోనూ కొందరు టీడీపీ నేతలు ఇక్కడ టిక్కెట్ రాదని ముందుగానే తెలిసి జాగ్రత్త పడి జనసేన, బీజేపీలో చేరి టిక్కెట్ పొందారు. దీంతో ఇప్పుడు పార్టీ మారే నేతలకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. కాకుంటే ఈ ఐదేళ్ల పాటు అధికార పార్టీలో ఉన్నామన్న ఏకైక కారణంతోనే మారాల్సి ఉంటుంది. అంతకు మించి పార్టీ ఎవరు మారినా రాజకీయంగా దారుణంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు.